తొక్కుతా అంటాడా.. కాల్చివాతలు పెడతాం, సినిమా వాళ్ల వల్లే ‘సీమ’నాశనం : పవన్‌కు బైరెడ్డి కౌంటర్
రాయలసీమకు చెందిన నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. పవన్ తొక్కుతా అంటున్నారని, తొక్కడానికి కొండారెడ్డి బురుజు దగ్గరకి వస్తాడా అని బైరెడ్డి సవాల్ విసిరారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాయలసీమపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. పవన్ కల్యాణ్‌కి రాయలసీమపై నాలెడ్జ్ లేదని బైరెడ్డి దుయ్యబట్టారు. పవన్ పిచ్చి డైలాగులు మానుకోకపోతే రాయలసీమలో తిరగలేరని రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. రాయలసీమలో సినిమా డైలాగులు పనికిరావని.. పవన్ తొక్కుతా అంటున్నారని, తొక్కడానికి కొండారెడ్డి బురుజు దగ్గరకి వస్తాడా అని బైరెడ్డి సవాల్ విసిరారు. పవన్ పిచ్చి మాటలు మానుకోకపోతే కాల్చి వాతలు పెడతామని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో ఒకసారి దెబ్బతిన్న విషయం పవన్ గుర్తుంచుకోవాలని బైరెడ్డి చురకలంటించారు. కొండారెడ్డి బురుజు దగ్గర ఫ్యాక్షన్ సీన్లు తీసి .. రాయలసీమను సినిమా వాళ్లు సర్వనాశనం చేశారని రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారాహి రోడ్డు మీదకు రానివ్వమని నానా రచ్చ చేశారని.. ఆపేస్తామని మాట్లాడారని.. అయితే తమను ఎవరూ ఆపలేరని అన్నారు. డబ్బులు దోచుకుని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించేవారికే అంతుంటే.. ఏ తప్పు చేయని తనకెంతా ధైర్యం ఉండాలని అన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అన్నారు. చట్టానికి అతీతంగా హత్యలు, కోడి కత్తితో పొడిపించుకుని డ్రామాలు చేయనని అన్నారు. చట్టాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తామని చెప్పారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ALso REad: ఏపీని విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతాం.. ప్రజలు విసిగిపోయారు: పవన్ కల్యాణ్
అనంతరం జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తన బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి తాను పార్టీ ప్రారంభించానని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన కార్యాలయానికి రావొచ్చని అన్నారు. బ్రిటీష్‌వారు పోయినా వాళ్ల అహంకార ధోరణి ఇంకా పోలేదని అన్నారు. తాను అవగాహన లేకుండా దేనిపైనా మాట్లాడనని చెప్పారు. యూనివర్సిటీల్లో చదవకపోయినా నోటికి వచ్చినట్టుగా మాట్లాడనని అన్నారు. కులాల మధ్య ఐక్యత కోసం పనిచేస్తానని చెప్పారు.
ఒక చేయి సొంత కులం వైపు.. మరో చేయి వేరే కులాల వైపు ఉండాలని అన్నారు. లేకుంటే మిగిలిన కులాలకు దూరమవుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కులపిచ్చి ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం.. కులస్వామ్యం కాదన్నారు. యువత ఇప్పుడు బయటకు రాకుంటే, అన్యాయాన్ని ఎదుర్కొకపోతే బానిసల్లా ఉండిపోతారని అన్నారు. ‘‘పార్టీ నిర్మాణం అంటే ఒక్క రోజులో జరిగే పని కాదు. పార్టీ నిర్మాణానికి సమయం పడుతుంది. పెరుగు తోడు వేస్తే.. అది తోడుకోవడానికి రాత్రి సమయం పడుతుంది. పార్టీ నిర్మాణంపై దశాబ్దం పాటు వేచిచూసిన తర్వాత.. అప్పుడు ఎటూవైపు వెళ్తుందో చూసుకుందాం’’ అని పవన్ అన్నారు.
రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో జనాలు విసిగిపోయారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?.. రాజ్యాంగం గురించి ఏం తెలుసు అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదం గురించి మాట్లాడితే తన అంత తీవ్రవాది ఉండడని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొడతామంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు.