కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో భూకుంభకోణాలు జరుగుతున్నాయని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. అవినీతిని అంతం చేస్తాం, అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తామని అంటున్న జనగ్ తన సొంత జిల్లాలో జరిగిన, జరుగుతున్న భూకుంభకోణాల గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు. 

వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను, పేదల భూములను పెద్దలు కబ్జా చేశారని బీవీ రాఘవులు ఆరోపించారు. రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. జిల్లాలోని రాజంపేట రెవెన్యూ డివిజన్ లో భూకుంభకోణాలు జరిగాయని చెబుతున్న ప్రాంతాల్లో ఆయన సోమవారం పర్యటించారు. 

ఆ తర్వాత ఆర్థిక మాంద్యం - ప్రజలపై భారం అనే అంశంపై కడపలో జరిగిన సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో పదికిపైగా గ్రామాల్లో పేదల భూములను కొంత మంది రాజకీయ నేతలు, ప్రముఖులు, సంపన్నులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 

కబ్జా చేసిన భూములను బినామీల పేర్లతో అనుభవిస్తున్నారని ఆయన అన్నారు .1998లో పట్టాలు ఇచ్చి, 2001లో పాస్ పుస్తకాలు జారీ చేసి తిరిగి వాటినే ఇతరులకు అప్పగించారని ఆయన విమర్శించారు. ఇదేమిటని ప్రశ్నించినవారిపై కేసులు పెట్టారని ఆయన అన్నారు. ఈ భూకుంభకోణాలపై అప్పటి కలెక్టర్ బాబురావునాయుడు, ఆర్డీవో నేతృత్వంలో ఆరుగురు తాహిసీల్దార్లు సభ్యులుగా విచారణ నిర్వంచి, నివేదిక సమర్పించారని, అయితే ఇప్పటి వరకు దానిపై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి భూకుంభకోణాలు జరుగుతుంటే జగన్ స్పందించకపోవడం జిల్లా ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఈ విషయంపై త్వరలో ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని ఆయన చెప్పారు.