వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠలకు హైదరాబాద్‌, బెంగలూరు నగరాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని వారే స్వయంగా మీడియాకు చెప్పుకున్నారు. జగన్‌ ఎన్నికల ప్రచారానికి రాకముందే.. రేణుక తన ఫైనాన్షియల్‌ స్టేటస్‌ గురించి వివరించారు. ఆమెకు మాదాపూర్‌లో ధనవంతుల పిల్లలు చదివే మెరీడియన్ స్కూలు, బుట్టా కన్వెన్షన్ సెంటర్, ప్రతుల్ హోండా వంటి షోరూమ్‌లు నడుపుతున్నట్లు తెలిపారు. 
గత ఏపీ ఎన్నికలకు ముందు ఎమ్మిగనూరు సిద్ధం సభలో వైసీపీ నేత బుట్టా రేణుకపై జగన్ మోహన్ రెడ్డి జాలి చూపించారు. ఆర్థికంగా ఆమె అంతంత మాత్రమే అని జగన్ చెప్పారు. ఆ వీడియో, బుట్టా తన ఆస్తులు ప్రకటించిన వీడియో రెండు కలిపి ట్రోల్‌ చేశారు. రీసెంట్‌గా బుట్టా ఆస్తులను ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ జప్తు చేసింది. 

బుట్టా రేణుక దంపతులు ఎల్‌ఐసీకి చెందిన హెచ్‌ఎఫ్‌ఎల్‌ అనే సంస్థ ద్వారా సుమారు రూ.310 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వాటిని తిరగి చెల్లించలేదట. ఈక్రమంలో కొల్లాట్రల్‌గా పెట్టిన ఆస్తుల వేలం దిశగా ఫైనాన్స్‌ సంస్థ చర్యలు తీసుకుంటోంది. కొన్నాళ్లు సజావుగా కిస్తీలు కట్టిన బుట్టా ఫ్యామిలీ, దాదాపు అయిదేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా కట్టలేదట. హెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రతినిధులు పలుమార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదు. 

ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ వద్ద 2018లో 15ఏళ్ల కాలవ్యవధిలో రూ.310 కోట్ల వరకు రేణుక, ఆమె భర్త నీలకంఠలు అప్పు తీసుకున్నారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, మెరిడియన్‌ ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలకు ఆ అప్పును వాడుకున్నారు. ఇప్పటి వరకు కేవలం రూ.40 కోట్ల అప్పు మాత్రమే చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా రూ.340 కోట్లు కట్టాల్సి ఉంది. వడ్డీ భారం అధికంగా ఉన్నందున ఆస్తులు అమ్మేందుకు అప్పు ఇచ్చిన సంస్థ సిద్దమైంది. 

కొనేందుకు ఎవరూ రాని పరిస్థితి... 

బుట్టా ఆస్తులను వేలం వేసేందుకు ఫైనాన్స్‌ సంస్థ సిద్దం కాగా.. కొనేందుకు ఎవరూ రాని పరిస్థితి. బంజారాహిల్స్‌లోని ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేయగా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మాదాపూర్‌లోని 7,205 చ.గజాల్లోని బుట్టా కన్వెన్షన్‌ వేలానికీ స్పందన లేదు. ఈ ఆస్తులు కొనుగోలు చేస్తే.. రేపు ఏ తలనొప్పి వస్తుందోనని ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. 

ఒకవేళ బుట్టా రేణుక ఆస్తులు వేలంలో ఎవరైనా కొలుగోలు చేస్తే.. మాజీ సీఎం జగన్‌ మాట్లాడినట్లు బుట్టమ్న ఆస్తులు అంతంత మాత్రంగానే మారనున్నాయి. మరోవైపు ఎల్‌ఐసీ వంటి సంస్థల్లో పేదలు కిస్తీలు కడుతుంటారు. ఆ సంస్థ కింద ఇలా రుణాల రూపంలో బడాబాబులు అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం వల్ల ఆ భారం పేదలపై పడుతోంది.