Bunny Festival : కర్నూల్ జిల్లాలో అర్ధరాత్రి జరిగిన కర్రల సమరంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు… వందలాదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Bunny Festival : దసరా పండగపూట ఆంధ్ర ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ప్రతిసారిలాగే ఈ దసరాకు కూడా బన్నీ ఉత్సవాలు జరిగాయి. ఈ కర్రల సమరంలో ఇద్దరు బలికాగా మరో 100 మందికి గాయాలయ్యారు. కొందరికి తీవ్రగాయాలు కావడంతో ఆదోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఏమిటీ కర్రల సమరం...
ఆంధ్ర ప్రదేశ్ దేవరగుట్టలో ప్రతి దసరాకి మాళ మల్లేశ్వరస్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇలా నిన్న(గురువారం) స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది... ఆ తర్వాత బన్నీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అంటే పూజలందుకున్న మల్లేశ్వర స్వామి విగ్రహాలను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు కర్రలతో పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకోవడంతో ప్రాణాలు బలయ్యాయి.
ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం
దాదాపు రెండు లక్షలమంది ఆ బన్ని ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇలా భారీగా తరలివచ్చిన ప్రజలు కర్రలతో దాడులు చేసుకోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులు అరికెరికి చెందిన తిమ్మప్ప, కర్ణాటకకు చెందిన బసవరాజు తెలుస్తోంది. గాయపడిన బాధితులను ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
