కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక రాజకీయం దుమారం రేపుతోంది. ఇసుక కొరత అంశం వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. అయినప్పటికీ ఇసుక కొరత నివారణలో ఎలాంటి మార్పురాలేదని ఆరోపిస్తూ భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. 


ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇంటిని ముట్టడించేందుకు భవన నిర్మాణ కార్మికులు ప్రయత్నించారు. ఇసుకను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని, అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.25లక్షలు చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 

ఇసుక కొరత వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు  నానా పాట్లు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు కార్మికులకు రూ.10వేలు చొప్పున కరువు భత్యంగా అందించాలని డిమాండ్ చేశారు. 

ఏపీ బిల్డింగ్ వర్కర్స్, ఇతర అసోషియేషన్లకు చెందిన భవన నిర్మాణ కార్మికులు మంగళవారం సర్పవరం జంక్షన్ లో ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా మంత్రి కన్నబాబుకు ఇంటి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

అనంతరం బారికేడ్లను దాటి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే సమాచారం అందుకున్న మంత్రి కన్నబాబు భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకుడు రాజకుమార్ తో ఫోన్లో మాట్లాడారు. ఇసుక కొరత సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 

మరోవైపు కాకినాడ రూరల్ తహాశీల్దారు మురళీకృష్ణ సైతం మంత్రి నివాసం వద్దకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అయినప్పటికీ ఆందోళన విరమించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమందిని లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ ఘటనలో భవన నిర్మాణ కార్మికుడు రొంగలి ఈశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. అతనిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ట్రాక్టర్లతో తొక్కించి చంపారు-వనజాక్షిపై దాడి చేశారు: పవన్ పై మంత్రి కన్నబాబు

బాత్రూంల పక్కన కూర్చుని పవన్ ఏం చేశాడంటే...: కన్నబాబు సంచలన వ్యాఖ్యలు