అమరావతి: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టి బడ్జెట్‌ సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నేషనల్‌ రూరల్‌ వాటర్‌ మిషన్‌కు తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటుతో పాటు ప్రత్యేక హోదా, అమరావతి గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇప్పటికే సీఎం వైయస్ జగన్‌ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని అయినా కేంద్రం అన్యాయం చేసిందని వాపోయారు. కనీసం వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు కేటాయించలేదని ఆక్షేపించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని కేంద్రం చేయిపట్టుకుని నడిపించాల్సిన అవసరముందని తెలిపారు. రాష్ట్రానికి మేలు చేస్తామంటూ విభజనకు మద్దతు పలికిన యూపీఏ, ఎన్డీయే కూటముల్లోని పార్టీలపైనా ఏపీ అభివృద్ధి పట్ల బాధ్యత ఉందన్నారు. 

కేంద్ర బడ్జెట్‌ ప్రభావం త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌పై కచ్చితంగా ఉంటుందని ఆయన తెలిపారు. టీడీసీ ప్రభుత్వం దుబారా ఖర్చుతో అప్పులు పెరిగిపోయాయని ఆ అప్పులకు సంబంధించి వడ్డీ భారం ప్రభుత్వంపై పడుతోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి  స్పష్టం చేశారు.