హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిస్తే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలికెందుకని వైసీపీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. 

తమ అధినేతను కేటీఆర్ కలిస్తే అదేదో పెద్ద నేరం అన్నట్లు చంద్రబాబు నాయుడు అండ్ టీం అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుని ఇతర పార్టీ నేతలు కలవలేదా అని ప్రశ్నించారు. గతంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంది వాస్తవం కాదా అని నిలదీశారు. 

2004లో బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పు అన్న చంద్రబాబు నాయుడు 2014లో మళ్లీ బీజేపీతో కలవలేదా అని ప్రశ్నించారు. 2009లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది వాస్తవం కాదా అని నిలదీశారు. అప్పుడు తప్పు కాదు ఇప్పుడు తప్పా అని ప్రశ్నించారు. 

అసలు టీఆర్ఎస్ తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. దివంగత నేత నందమూరి హరికృష్ణ శవం పక్కనే పొత్తుల కోసం కేటీఆర్ తో చర్చేందుకు ప్రయత్నించలేదా అంటూ నిలదీశారు. కేటీఆర్ అంగీకరించలేదు కాబట్టి పొత్తు లేదని లేకపోతే పెట్టుకునేవాడివి కాదా అంటూ ధ్వజమెత్తారు.

ఒక పార్టీ నేతగా జగన్ ఇంటికి అతిథిగా కేటీఆర్ వస్తే తప్పు తప్పంటూ చేస్తున్న వార్తలు ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఏకంగా నానా మాటలు ఆడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

తెలంగాణతో గొడవలు కనిపించడం లేదా, ఢిల్లీతో లొల్లి జగన్ కు కనిపించడం లేదా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అది సరికాదన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్రంతో సంప్రదింపులు సక్రమంగా చెయ్యాల్సింది పోయి తమపై విమర్శలు చెయ్యడం కరెక్టా అని నిలదీశారు. 

అంటే సీఎంగా ఉండి చంద్రబాబు చెయ్యలేదని జగన్ అయినా చెయ్యాలంటూ ఇండైరెక్ట్ గా చెప్తున్నారా అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మళ్లీ నువ్వే రావాలి బాబు అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయని అవి కార్యకర్తలు పెడుతున్నారా లేక చంద్రబాబు పెట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. 

ప్రపంచంలో ఏ నాయకుడు ఇలా ఫ్లెక్సీలు వేయించుకోరన్నారు. చంద్రబాబు అభద్రతా భావంతోనే ఇలా ఫ్లెక్సీలు వేయించుకుంటున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

మా హామీలు, కేసీఆర్ స్కీమ్స్ కాపీ: చంద్రబాబుపై బుగ్గన ఫైర్