అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమీక్షా సమావేశాలకు ఎన్నికల కమిషన్ బ్రేక్ లు వేయడంపై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేయగానే చంద్రబాబు సమీక్షలకు ఈసీ అడ్డుతగిలిందని ఆయన ఆరోపించారు. 

వైసీపీ నేత విజయసాయి రెడ్డి, బిజెపి నేత జీవీఎల్ లపై  బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.  జీవీఎల్ మైక్‌లో, విజయసాయి ట్విట్టర్‌లో మొరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీవీఎల్‌పై చెప్పులు విసిరినట్టు మే 23 తర్వాత విజయసాయికి చెప్పు దెబ్బలు పడుతాయని ఆయన అన్నారు. 

ప్రధాని పదవి నుంచి మోడీ దిగిపోగానే విజయసాయి జీవితాంతం చిప్పకూడు తింటాడని అన్నారు. జీవీఎల్ చేతిసంచితో మరోసారి దేశం మొత్తం తిరగాల్సి వస్తుందన్నారు. ఎన్నికల్లో జగన్‌ రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని బుద్ధా వెంకన్న విమర్శించారు.