అమరావతి : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు మధ్య వైరం ముదురుతోంది. పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఆదివారంనాడు ఉదయం ప్రారంభమైన ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

"చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు" అని బుద్ధా వెంకన్న కేశినేని నానిపై విరుచుకుపడ్డారు. 

"విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు.. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు" కూడా అన్నారు.
 
"నిన్నటి దాకా చంద్రబాబు కాళ్ళు.. రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్ళు.. కాళ్ళు కాళ్లే.. వ్యక్తులు మాత్రమే తేడా!!!" అని కేశినేని నాని  వ్యాఖ్యానించారు. దానిపై బుద్ధా వెంకన్న తీవ్రంగా ప్రతిస్పందించారు.  "గుర్తింపు కోసం అడుక్కునేవాడు అధమస్థాయి బిచ్చగాడు... విజయసాయిరెడ్డి గారు దీనికి మీరు పరాకాష్ట.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత చంద్రబాబుగారిది" అని బుద్ధా వెంకన్న అన్నారు. 

"అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసిన అవినీతికి 16 నెలలు జైల్లో కూర్చున్న ఘనత తమది. విమర్శించడానికి నోరొక్కటే కాదు, అర్హత ఉండాలి విజయసాయి రెడ్డిగారు. మీకున్న ప్రధాన అర్హత కాళ్ళమీద పడడం అని మరిచారా?" అని కూడా అన్నారు.