అమరావతి: బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. దమ్ముంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని సవాల్ చేశారు. 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుకు అంతా తామేనంటూ చెప్పి దేశవ్యాప్తంగా ఎన్నో పైరవీలు చేసుకున్నారని ఆరోపించారు. తీరా అధికారం కోల్పోయిన తర్వాత నెలరోజుల్లోనే పార్టీ మారుతూ నమ్మక ద్రోహం చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. 

నిన్న మెున్నటి వరకు బీజేపీని తిట్టని తిట్లు తిట్టిన ఆ ఎంపీలను బీజేపీ చేర్చుకోవడం సిగ్గు చేటన్నారు. బీజేపీలో చేరిన వెంటనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి టిఫిన్ చేయడం సిగ్గు చేటన్నారు. ఒకప్పుడు అదే విజయసాయిరెడ్డిని మీరు తిట్టలేదా అని వెంకన్న నిలదీశారు. 

విజయసాయిరెడ్డి మిమ్మల్ని తిట్టలేదా మండిపడ్డారు. మీ అభివృద్ధికోసం మీ స్వార్థంకోసం తెలుగుదేశం పార్టీని వినియోగించుకుని తీరా అధికారం కోల్పోయాక పార్టీకి నమ్మక ద్రోహం చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. 

స్వార్థం కోసం పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో తిరిగే అర్హత వీరికి లేదన్నారు. కేసులకు భయపడో, స్వార్థం కోసమో పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు చంద్రబాబుపై అనవసర వ్యాఖ్యలు చేస్తే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడే బీజేపీలోకి వెళ్లమన్నారంటూ చెప్పడం సిగ్గు చేటన్నారు బుద్ధా వెంకన్న.   
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు కోసం చస్తా, ఎంపీలు జైల్లో పెట్టిస్తారని యార్లగడ్డ బెదిరించారు : ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న