విజయవాడ: సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్న అధికారుల అధికారాలను తుంగలోతొక్కుతూ ఐఏఎస్ సర్వీసులను అయ్యాఎస్ సర్వీసులుగా మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారితో తన ఇష్టానుసారం ఆడుకుంటున్నాడని  వెంకన్న మండిపడ్డారు. 

సోమవారం బుద్దా మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ అధికారంలోకి రాకముందు ఆయనకు చేదోడువాదోడుగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా అజయ్ కల్లంరెడ్డి, పీ.వీ.రమేశ్, కృష్ణకిషోర్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వంటి వారిని అయ్యా ఎస్ అనేలా చేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐఏఎస్ లంటే జగన్మోహన్ రెడ్డి పాలేర్లా? అని ప్రశ్నించారా బుద్దా వెంకన్న. 

తండ్రి హయాంలో తనతో పాటు తప్పు చేసిన అధికారులందరినీ తనతో పాటే జైలు జీవితం గడిపేలా చేసింది జగన్ కాదా అన్నారు. ఇప్పుడు కూడా జగన్ తన మాటవినని అధికారులను పక్కనపెతున్నారన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని వెంకన్న తెలిపారు. ఐఏఎస్ లు ఎవరైనా సరే తన మాట వినకపోతే ఆఘమేఘాలమీద పక్కకు నెట్టడం జగన్ కు అలవాటుగా మారిందన్నారు. జగన్ తన వైఖరి మార్చుకోకుంటే ఏదో ఒకరోజు రాష్ట్రంలోని ఐఏఎస్ లంతా పెన్ డౌన్ అనే పరిస్థితి వస్తుందన్నారు. 

పరిపాలకులను సరైన మార్గంలో పెట్టే వ్యవస్థతో ఆటలాడటం ప్రజాస్వామ్యానికే చేటన్నారు వెంకన్న. జగన్ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. చట్టానికి అతీతంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని... కోర్టులు 60సార్లకు పైగా జగన్ కు మొట్టికాయలు వేసినా ఆయన వైఖరి మారలేదన్నారు. అధికారంలోకి వచ్చి 13 నెలలైనా జగన్ ఒక్కరోజు కూడా ప్రజల్లోకి వెళ్లలేదని, వారి ఆలోచనా సరళి ఆయనకు పట్టడం లేదన్నారు. 

ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేతల అంతుచూస్తే...తరువాత వచ్చే వారు ఆయన అంతుచూడరా? అని వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబుపై, లోకేశ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా రాజకీయంగా ఎదుర్కొన్నామే తప్ప, అంతుచూసే చర్యలను టీడీపీ ఏనాడు ప్రోత్సహించలేదన్నారు. విజయసాయి మూడు జిల్లాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ తన చెల్లుబాటును కొనసాగిస్తున్నాడని... ఆయనకు కాలమే తగిన సమాధానం చెబుతుందని వెంకన్న హెచ్చరించారు.

సీఎం జూమ్ యాప్ లో ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటని... తాడేపల్లి రాజమహాల్ కు కూతవేటు దూరంలో ఉన్న చోటుకి స్వయంగా రాకపోవడం దారుణమన్నారు. అంబేద్కర్ వంటి మహనీయుడి విగ్రహ ఏర్పాటుకి వీడియో ద్వారా శంకుస్థాపన చేయడం జగన్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అంబేద్కర్ వంటి గొప్పవ్యక్తిని ఓట్ల కోసం వాడుకోవడం తగదని బుద్దా హితవు పలికారు.  

read more   పితాని తనయుడు సురేష్‌కు చుక్కెదురు: ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర బాగోగులు చూసేవాడని, అలా కాకుండా దోచుకోవడానికి తనక సహాయపడేవారిన పక్కనపెట్టుకోవడం మంచిపద్దతి కాదన్నారు. అజయ్ కల్లం గతంలో జగన్ కు చాలా సపోర్ట్ చేశాడని... ఆయన ఏం చెప్పాడో తెలియదు గానీ జగన్ ఆయన్ని పక్కకు నెట్టాడన్నారు. ప్రతిపక్షంగా ప్రజల సాధకబాధకాలు తెలియచేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు వెంకన్న. 

కరోనా సమయంలో ప్రజలు అల్లాడిపోతుంటే జగన్ వారి గురించి ఆలోచించడం లేదన్నారు. కేవలం రూ.1000 ఇస్తేనో, నూకల బియ్యం, శనగలు ఇస్తేనో ప్రజల ఆకలి తీరదని ఇంత చేస్తే వారి సమస్యలు తీరవనే విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. కరోనా సమసిపోయేవరకు పేద, మధ్య తరగతి కుటుంబాలకు నెలకు రూ.10వేల చొప్పున ఇవ్వాలని బుద్దా డిమాండ్ చేశారు. 

మద్యం ధరలు పెంచితే ప్రజలు తాగడం మానేస్తారనుకోవడం అనాలోచిత నిర్ణయమన్నారు.  అమ్మవడి కింద రూ.15వేలు, ఆటోవాళ్లకు రూ.10 వేలు ఇచ్చినట్టే ఇచ్చిన ప్రభుత్వం ఆ సొమ్మంతా వివిధ మార్గాల్లో తిరిగి ఖజానాకే వచ్చేలా చేసిందన్నారు.  ఐఏఎస్ లంటే ప్రజలకు అపారమైన గౌరవముందని, దాన్ని తన తండ్రి హయాంలో మాదిరిగా నిర్వీర్యం చేసి అధికారులను జైళ్లకు పంపే చర్యలు జగన్  మానుకోవాలన్నారు. ఐఏఎస్ లు  ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజల పక్షాన నిలిచి, నిజాయితీతో సేవలు అందించాలని బుద్దా విజ్ఞప్తి చేశారు. 

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్వీ.సుబ్రహ్మణ్యం ఆయనకోసం ఎంతగానో పనిచేశారని... అటువంటి వ్యక్తినే ప్రభుత్వం రాగానే జగన్ సాగనంపాడన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టీడీపీకి అనుకూలం కాదని... ఆయనపై పలుమార్లు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అధికారులు జగన్ మనస్తత్వాన్ని గ్రహించాలని... ఆయన ఏపూటకు ఆ పూటే అన్నట్లుగా అధికారులను వాడుకుంటున్నాడన్నారు. 

జగన్ వ్యవహరశైలిపై కేంద్రానికి పిర్యాదు చేస్తామని, ఆయన నిర్ణయాలపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని వెంకన్న అభిప్రాయపడ్డారు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చే అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు తీసేయడం, నియమించడం ఎంతమాత్రం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి తన మదిలోని ఆలోచనలకు అనుగుణంగా పాలన చేస్తున్నారన్న వెంకన్న... 33 మంది సలహాదారులను నియమించి తన సొంత ఆలోచనలను ప్రజలపై రుద్దుతున్నారన్నారు. అంతా నా ఇష్టం అనేలా జగన్ పాలన చేస్తున్నాడన్నారు.