జగన్ తో సుబ్రహ్మణ్యస్వామి భేటీ... అందుకోసమే..: బుద్దా వెంకన్న
చంద్రబాబుపై విమర్శలు చేసి జగన్ ను ప్రశంసించిన సుబ్రహ్మణ్యస్వామికి చురకలు అంటించారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.
విజయవాడ: బుధవారం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసారు. ఇలా చంద్రబాబుపై విమర్శలు చేసి జగన్ ను ప్రశంసించిన సుబ్రహ్మణ్యస్వామికి చురకలు అంటించారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.
ప్రత్యేక విమానంలో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోకుండా సుబ్రహ్మణ్యస్వామి అవినీతి చక్రవర్తితో కలిసి భోజనం చేయడమేంటి? అని వెంకన్న ప్రశ్నించారు. ఎందరో అవినీతి ముఖ్యమంత్రులను జైలుకుపంపిన వ్యక్తి అవినీతి సామ్రాట్ తో ఏం మంతనాలు జరిపారు? అని నిలదీశారు. సుబ్రహ్మణ్యస్వామికి జగన్ తో ఉన్న లాలూచీ ఏమిటో, వారిద్దరి మధ్యజరిగిన చర్చలేమిటో ఆయనే బయటపెట్టాలి అని వెంకన్న అన్నారు.
''ఎవరి మెప్పుకోసం సుబ్రహ్మణ్యస్వామి చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని పసలేని ఆరోపణలు చేశారు? రాజకీయ ప్రయోజనాలతోనే సుబ్రహ్మణ్యస్వామి జగన్ తో సమావేశమయ్యాడని ప్రజలకు అర్థమైంది. జగన్ పై, ఆయన ప్రభుత్వ అవినీతిపై తెలుగుదేశం పార్టీనే పోరాడుతోందనే వాస్తవం సుబ్రహ్మణ్యస్వామికి తెలియకపోవడం విడ్డూరంగా ఉంది'' అని వెంకన్న అన్నారు.
''మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుచేసింది. పోలీసులు, అధికారుల సాయంతో టీడీపీవారిని అడ్డుకొని రాత్రికిరాత్రే వైసీపీ నేతలు డబ్బు పంపిణీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి జగన్ ప్రభుత్వంపై ఉన్న భయమే కారణం. కొల్లు రవీంద్ర నిజంగా ఎన్నికల విధులకు ఆటంకం కల్గిస్తే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? తాడేపల్లి ఆదేశాలకోసం పోలీసులు ఎదురుచూశారా?'' అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
వెంకటేశ్వరస్వామిపై మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తానని ఎంపీ, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చెప్పారు. ఓ మీడియా సంస్థపై కూడ కేసు వేస్తానని ఆయన చెప్పారు. టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకొని రావాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయంలో ఎక్కువగా అవినీతి చోటు చేసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగ్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.
తమిళనాడులోని నటరాజస్వామి ఆలయంపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చేశానని ఆయన గుర్తు చేశారు. టీటీడీపై కూడ ప్రభుత్వ పెత్తనం లేకుండా చేస్తానని ఆయన తెలిపారు. తిరుమలను కూడ ప్రభుత్వ ఆధిపత్యం నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడ కేసు వేస్తున్నట్టుగా ఆయన వివరించారు.