టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై మారణాయుధాలతో దాడిచేసిన దువ్వాడ శ్రీనివాస్ దర్జాగా పోలీసుల భద్రతతో తిరుగుతుంటే, దాడికి గురైన బలహీనవర్గాల నాయకుడైన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం ముమ్మాటికీ బీసీలపై దాడిచేయడమే అవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తేల్చిచెప్పారు. 

మంగళవారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో వెంకన్న మాట్లాడుతూ.... బీసీలు ఎవరూ పైస్థాయికి వెళ్లకూడదు, వారు రాజకీయ పదవులు అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిందన్నారు. ఉత్తరాంధ్ర భూబకాసురుడు విజయసాయిరెడ్డి, రామతీర్థానికివెళ్లిన చంద్రబాబుపై స్థానికులను రెచ్చగొట్టాలని ప్రయత్నించాడని, ఆనాడే ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో ఏ2 ద్వేషాల కేంద్రంగా మార్చాడన్నారు. ఉత్తరాంధ్ర తగలబడితే విజయ సాయికి ఎందుకంత పైశాచిక ఆనందమో చెప్పాలని బుద్దా డిమాండ్ చేశారు. 

విజయసాయికి నిమ్మాడకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై దాడిచేసిన దువ్వాడ శ్రీనివాస్ ను పరామర్శించి, అతన్ని మరింత రెచ్చగొట్టడానికే  ఏ2 అక్కడికి వెళుతున్నాడన్నారు. దువ్వాడ దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోలేదని, ఆ కారణంగానే అతను మరింత రెచ్చిపోయాడన్నారు. పోలీసులు తక్షణమే విజయసాయి నిమ్మాడ పర్యటనను అడ్డుకోవాలని, అతనిపై ఉన్న కేసుల దృష్ట్యా అతనికి ఇచ్చిన  బెయిల్ ను కూడా తక్షణమే రద్దుచేయాలని వెంకన్న డిమాండ్ చేశారు. 

read more  పట్టాభిపై హత్యాయత్నం వెనక హస్తం వారిదే: యనమల సంచలనం

ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను కార్చిచ్చుకు కేంద్రంగా మార్చిన విజయసాయిని చూస్తుంటే స్పైడర్ సినిమాలో భైరవుడనే విలన్ పాత్రధారి గుర్తుకువస్తున్నాడన్నారు. ప్రజలంతా ఏడుస్తున్నప్పుడు అతను నవ్వుతుంటాడని, అదేవిథంగా ఉత్తరాంధ్ర తగలబడుతుంటే విజయసాయి వికటాట్టహాసం చేస్తున్నాడన్నారు.  విజయసాయి రెడ్డి నిమ్మాడ పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు తనకు అనుమతి ఇవ్వాలని, టీడీపీ ఉత్తరాంధ్ర ప్రాంత ఇన్ ఛార్జ్ గా తానుకూడా అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శిస్తానని బుద్ధా తేల్చిచెప్పారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సహనాన్ని, ఓర్పుని చేతగానితనంగా ప్రభుత్వం,  పాలకులు, అధికారులు భావిస్తే అందుకు తగినమూల్యం చెల్లించుకోవడం ఖాయమని వెంకన్న తీవ్ర స్వరంతో హెచ్చరించారు.  ప్రభుత్వం చెప్పిందానికల్లా తలాడించకుండా పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తే వారికే మంచిదని బుద్దా హెచ్చరించారు.