కూల్చేయాల్సింది ప్రజా వేదిక కాదని... లోటస్ పాండ్ అని.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ట్వీట్ కి బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ని రిట్వీట్ చేసిన బుద్ధా... లోటస్ పాండ్ మీద కౌంటర్ వేశారు. ఏపీలో నదీగర్భాన్ని పూడ్చికట్టిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమైతే.. తెలంగాణలో చెరువును పూడ్చి కట్టిన లోటస్‌పాండ్ సక్రమ నిర్మాణం అవుతుందా? అని ఎదురు ప్రశ్న సంధించారు. కిన్లే వాటర్ బాటిల్‌లో రూ.40 మిగిల్చిన మీ సీఎం గారు.. రూ.8 కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చమంటున్నారని విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. 

చీనీ తోటలు తగలబెట్టే ఫ్యాక్షన్ బుద్ధి ఎక్కడికి పోతుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికను చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ప్రభుత్వ, ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు. ‘

‘కట్టేవారికే నిర్మాణ విలువ తెలుస్తుంది.. విధ్వంసకులకు కూల్చడం మాత్రమే తెలుసు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అక్రమాస్తులతో కట్టిన లోటస్‌పాండ్‌ని ముందుగా కూల్చేయ్.. అప్పుడే మీరు చెబుతున్న నీతి, నిజామాయితీ, నిబద్ధత నిలబడుతుంది’’ అని బుద్దా వెంకన్న విజయసాయికి కౌంటర్ ఇచ్చారు.