బాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారు: భువనేశ్వరికి బీఆర్ఎస్ నేత బండి రమేష్ సంఘీభావం
చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఇవాళ సమావేశమయ్యారు.
రాజమండ్రి: టీడీపీ చీప్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మణితో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ మంగళవారంనాడు భేటీ అయ్యారు.రాజమండ్రిలోని లోకేష్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కారద్యర్శి బండి రమేష్ భువనేశ్వరి, బ్రహ్మణితో సమావేశమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ , ఆ తర్వాత పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భువనేశ్వరికి, బ్రాహ్మణికి సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్టుగా ఆయన తెలిపారు. చంద్రబాబు కార్యదక్షత కలిగిన వ్యక్తి అని ఆయన చెప్పారు.తెలుగు ప్రజల కోసం చంద్రబాబు తన జీవితాన్ని దారబోశారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని బండి రమేష్ చెప్పారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారని బండి రమేష్ ధీమాను వ్యక్తం చేశారు.
చంద్రబాబు అరెస్ట్ పై తమ పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత విషయంగా కేటీఆర్ ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై కేటీఆర్ కారణాలు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ర్యాలీకి అనుమతివ్వలేదన్నారు. ఒకరు ర్యాలీ చేస్తే, వారికి పోటీగా మరో ర్యాలీని చేసే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని లోకేష్ తనకు ఓ మిత్రుడి ద్వారా అడిగారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ నెల 9వ తేదీన చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది చంద్రబాబుకు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలోనే లోకేష్ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారు.. ఈ కార్యాలయంలోనే నారా భువవనేశ్వరి, బ్రహ్మణి ఉంటున్నారు.