కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: దువ్వాడ పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు
కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దువ్వాడ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
విశాఖపట్టణం: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు విశాఖపట్టణం దువ్వాడ పోలీసులకు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ మూలధన విషయమై ఆర్ఐఎన్ఎల్ ఈఓఐని ఆహ్వానించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి డైరెక్టర్లు , జీఎంలు రెండు రోజులుగా విశాఖపట్టణంలో పర్యటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎండీతో కూడా సింగరేణిమ అధికారులు చర్చించారు.
కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే నిన్న విశాఖపట్టణం వచ్చారు. విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లబోమని ప్రకటించారు.కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.
also read:విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేసీఆర్ సర్కార్ తప్పుడు ప్రచారం: జీవీఎల్
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాలను బీజేపీ శ్రేణులు ఇవాళ తొలగించాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు తొలగించిన బీఆర్ఎస్ జెండాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుండి నేరుగా దువ్వాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటా పోటీగా జెండాలను తొలగించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.