ఇద్దరు చిన్నారులు నదిలో మునిగి, ఊపిరాడక చనిపోయారు. తోడళ్లుడి కుమారుడిని కాపాడగలిగిన తండ్రి.. సొంత కుమారులను రక్షించలేకపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా విషాదాన్ని నింపింది.
బంధువుల ఇంట్లో బర్త్ డే ఫంక్షన్ కు హాజరై, అదే ఊర్లో ఉన్న ఓ నదిలోకి ఈత కొట్టేందుకు హాజరైన ఆ అన్నదమ్ములు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. నదిలో ఈత కొడుతుండగా ఇసుక కోసం తవ్విన భారీ గుంతలో మునిగి వారిద్దరు దుర్మరణం పాలయ్యారు. సమీపంలోనే ఉన్న తండ్రి తోడళ్లుడి కుమారుడిని కాపాడారు. కానీ సొంత కుమారులను రక్షించుకోలేకపోయారు. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన కోన ఆనంద్ కు 11 ఏళ్ల కార్తికేయ, ఏడేళ్ల గణేష్ గౌతమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయనకు శ్రీకాకుళంలో బంధువులు ఉన్నారు. వారి ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు ఉండటంతో తన కుటుంబంతో కలిసి ఆయన మంగళవారం శ్రీకాకుళానికి వచ్చారు. అయితే మరుసటి రోజు ఉదయం సరదాగా తన కుమారులిద్దరినీ, అలాగే తోడళ్లుడి కొడుకైనా వర్షిత్ ను తీసుకొని దగ్గరలో ఉన్న నాగావళి నదికి బయలుదేరారు.
అక్కడికి వెళ్లిన తరువాత ముగ్గురు పిల్లలు నదిలో స్నానం చేస్తామని అన్నారు. దీనికి ఆనంద్ సమ్మతించారు. దీంతో ముగ్గురు నదిలో దిగి సరదాగా ఈత కొడుతూ, స్నానం చేస్తున్నారు. అయితే వీరు ఈత కొడుతున్న ప్రదేశంలో ఇసుక తవ్వకాల కోసం తీసిని భారీ గొయ్యి ఉంది. దీనిని గమనించగా ముగ్గురు పిల్లలు అక్కడికి వెళ్లడంతో, నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన ఆనంద్ ఒక్క సారిగా అప్రమత్తమయ్యారు.
వెంటనే వర్షిత్ ను రక్షించారు. కానీ తన కుమారులిద్దరినీ కాపాడుకోలేకపోయారు. వారిద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంత సమయం తరువాత రేవు వద్ద వీరిద్దరూ కనిపించారు. స్థానికులు వారిని గమనించారు. అప్పటికి చిన్నారులిద్దరూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే వారిద్దరూ పరిస్థితి విషమించడంతో చనిపోయారు.
