కట్టుకున్నవాడే.. అతి కిరాతకంగా రోజూ వేధింపులకు గురిచేస్తుంటే.. వాటిని తట్టుకోలేకపోయింది.

ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. కానీ.. ఆ ఆశలన్నీ అడియాశలేనని తెలుసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. కట్టుకున్నవాడే.. అతి కిరాతకంగా రోజూ వేధింపులకు గురిచేస్తుంటే.. వాటిని తట్టుకోలేకపోయింది. భర్త వరకట్న వేధింపులు భరించేలేక పెళ్లైన కొన్ని మూడు నెలలకే మృత్యువును చేరింది. ఈ సంఘటన కర్నూలులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నంద్యాల పట్టణంలోని మాల్దార్‌పేటకు చెందిన మనీషా (20) ఇంటర్‌ వరకు చదివింది. ఆమె తల్లిదండ్రులు తన చిన్నతనంలోని మృతి చెందడంతో మేనమామ మహేష్‌ వద్దనే ఉంటూ చదువుకుంది. ఈ ఏడాది జనవరిలో మనీషాకు పట్టణంలోని చింతరుగు వీధికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. కట్నంగా రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారు ఇచ్చారు. రాజేష్‌ పట్టణంలో మెడికల్‌ రెప్రజెంటేటివ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.


వివాహం అనంతరం తన వ్యాపారం కోసం అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మనీషా సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి మేనమామ మహేష్‌ ఫిర్యాదు మేరకు మనీషా భర్త రాజేష్, కుటుంబీకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ ఓబులేసు మంగళవారం తెలిపారు.