ఇక టిడిపికి నారా బ్రాహ్మణి నాయకత్వం: అధికారికంగా వెల్లడి
టిడిపి పగ్గాలు చేపట్టడానికి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. నారా లోకేష్ అరెస్టయితే నారా బ్రాహ్మణి పార్టీకి నాయకత్వం వహిస్తారని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు చెప్పారు.
విశాఖపట్నం: టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టయితే పార్టీ పగ్గాలు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ (టిడిపి) పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు గురువారం వెల్లడించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి ఎంవీపి కాలనీలో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
న్యూఢిల్లీ నుంచి రాజమండ్రికి రాగానే నారా లోకేష్ ను అరెస్టు చేస్తారనే సమాచారం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలోనూ విజయవాడలోనూ పార్టీ నాయకులు చర్చించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు జైలులో ఉన్నారని, లోకేష్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, టిడిపిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యం కాదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీలో నాయకులకు కొరత లేదని, అవసరమైన నారా బ్రాహ్మణి పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లు వేసిందని, రక్షణ కోసం రెండు అంబులెన్సులను పెట్టిందని ఆయన గుర్తు చేశారు. ప్రతిగా జగన్ ప్రతిపక్షాల ర్యాలీలను, నిరసన ప్రదర్శనలను నిషేధించారని ఆయన విమర్శించారు.
తనను మూడు రోజుల పాటు హౌస్ అరెస్టు చేశారని, పోలీసు స్టేషన్ కు పిలిచి ప్రశ్నించారని ఆయన అన్నారు. తనపై పోలీసులు 15 కేసులు పెట్టినట్లు అయ్యన్నపాత్రుడు చెప్పారు. పార్టీ కోసం తాను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.