ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ యువకుడు నాటు తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. పదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.  

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ యువకుడు నాటు తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. వివరాలు.. జిల్లాలోని పాచిపెంట మండలం తుమరవల్లి గ్రామానికి చెందిన చంద్రరావు అనే వ్యక్తి తన వద్ద ఉన్న నాటుతుపాకీతో పదేళ్ల బాలుడు అజిత్‌పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అజిత్‌ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కంటి వద్ద గాయం అయినట్టుగా తెలుస్తోంది. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు (కేజీహెచ్)కు తరలించారు. 

ఈ కాల్పులకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. చంద్రరావు వద్దకు తుపాకీ ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే చంద్రరావు బాలుడిపై అనుకోకుండా కాల్పులు జరిపాడా..? లేకుంటే కావాలనే కాల్పులు జరిపాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.