తెలుగుదేశం పార్టీపై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీ ఒక ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీ అని ఆరోపించారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే పోలవరం పనులు ఆలస్యమవుతున్నాయని..పట్టిసీమ కోసం పోలవరాన్ని పక్కనబెట్టారని బొత్స విమర్శించారు.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన కేంద్రానికి కానీ.. సమన్వయకర్తగా ఉన్న రాష్ట్రప్రభుత్వానికి కానీ అసలు ఈ పోలవరం విషయంలో చిత్తశుద్ధి ఉందా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం విషయంలో విడుదల చేస్తున్న మొదటి, రెండవ డీపీఆర్‌లకు సంబంధం లేదని.. అసలు ఈ రెండింటి మధ్య ఎందుకు వ్యత్యాలసాలు వస్తున్నాయి.. పోలవరం అంచనా వ్యయాన్ని ఎందుకు పెంచారని ఆయన విమర్శించారు.

 పోలవరం పనుల్లో కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జరిగిన పనుల్లో అక్రమాలు జరిగాయాని నిన్న గడ్కరీ పర్యటనలోనే బహిర్గతమైందన్నారు. ఇప్పటికైనా టీడీపీ, బీజేపీలు డ్రామాలను కట్టిపెట్టి పోలవరం ప్రాజెక్ట్‌పై డెడ్‌లైన్‌ ప్రకటించాలని బొత్స డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకే ప్రాజెక్ట్ గడువును పెంచుకుంటూ వెళుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బొత్స డిమాండ్ చేశారు.