ఎయిర్ ఏషియా స్కాంతో టీడీపీకి లింక్..?
ఎయిర్ ఏషియా కుంభకోణంలో తెలుగుదేశం పార్టీకి ప్రమేయం ఉందని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. లోటస్ పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎయిర్ ఏషియాకు అనుకూలంగా పరిణామాలు జరిగాయని.. ఆ సంస్థకు అనుకూలంగా నిబంధనలు సైతం మార్చారని బొత్స ఆరోపించారు. సింగపూర్ లాబీతో టీడీపీకి సంబంధాలు ఉండటంతో పాటు అదే సింగపూర్ లాబీకి రూ.12 కోట్లు ఇవ్వడం నిజమా..? కాదా..? అని బొత్స ప్రశ్నించారు. ఎయిర్ ఏషియా ప్రతినిధుల సంభాషణల్లో చంద్రబాబు పేరుందని.. రాజేందర్ దూబేతో సీఎం పలుమార్లు భేటీ అయ్యారని... ఎన్నో అవినీతి కేసుల్లో చంద్రబాబు పేరుందని ఆయన విమర్శించారు. ఏపీని దోచుకుతిన్నది చాలక.. ఇప్పుడు దేశాన్ని దోచుకుతింటున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
