ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం కమిటీ వేసిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) తెలిపారు. చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగులు రాలేదని అన్నారు. చర్చలకు వస్తారని ఉద్యోగుల కోసం 3 రోజులు వేచిచూశామని చెప్పారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం కమిటీ వేసిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) తెలిపారు. చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగులు రాలేదని అన్నారు. చర్చలకు వస్తారని ఉద్యోగుల కోసం 3 రోజులు వేచిచూశామని చెప్పారు. ఉద్యోగులు ఏ కోరిక కోరినా సమంజసంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమేనని అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ ఉద్యోగ సంఘాలు మాట్లాడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 

ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంపై దుర్భాషలాడటం తప్పని.. దానికి తగిన పర్యవసానాలు ఉంటాయని బొత్స హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని అంటూనే అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందజేయనున్నట్టుగా చెప్పారు. జీతాలు ప్రాసెస్ చేయని సిబ్బంది, ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్దంగా ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. తాము ఎలాంటి డెడ్‌లైన్ పెట్టలేదని తెలిపారు. ఉద్యోగులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. సహకరించని వారిపై ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. 

ఇక, పీఆర్సీ సాధన సమితి సోమవారం మరోసారి సమావేశమయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చలు జరుపుతున్నారు. ఒకసారి చర్చలకు వెళ్లి తమ డిమాండ్లను గట్టిగా విన్పించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆహ్వానించిన ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని వారు అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని అంటున్నారు.