విజయవాడ: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 

సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బొత్స గతంలో హోదాతో ఏం వస్తాయని ఎద్దేవా చేసిన బాబు నేడు ధర్మపోరాట దీక్షలు చెయ్యడం విడ్డూరంగా ఉందన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కారణంగానే ప్రత్యేక హోదా నేటికీ సజీవంగా ఉందన్నారు. చంద్రబాబు దీక్షలు చెయ్యడం లేదని రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే హోదా పేరుతో చంద్రబాబు సరికొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

ప్రధాని నరేంద్రమోదీతో నాలుగున్నరేళ్లు అంటకాగి ఎన్నికలకు ఆరు నెలల ముందు బై బై చెప్పేశారని ఆరోపించారు. క్షణాల్లో కాంగ్రెస్ తో జతకట్టారని విమర్శించారు. దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బొత్స ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అది జగన్ మాత్రమే సాధించగలరని ప్రజలు విశ్వసిస్తున్నారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.