బాబుపై బొత్స వ్యాఖ్య: అమిత్ షా రామోజీని కలవడంపైనే...

Botcha comments on meeting between Ramoji Rao and Amit Shah
Highlights

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావును కలవడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ తన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఎక్కుపెట్టారు.

విశాఖపట్నం: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావును కలవడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ తన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఎక్కుపెట్టారు. అమిత్‌ షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబు రాజగురువును కలిశారని ఆయన అన్నారు. 

టీడీపీని, బీజేపీని కలపడానికేనని ఆ భేటీ జరిగిందని ఆయన అన్నారు. ఇది నిజం కాదా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఏపీలో ఎన్నడూ.. ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. బాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ అటకెక్కాయని అన్నారు. మహిళలకు పది వేలు ఇచ్చామంటూ ఇప్పుడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని బొత్స అన్నారు. 

 టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో నేరుగా ప్రజలకే చెప్పాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. కాపులకు ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని, రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చూపించకుండా 25 వేల కోట్ల రూపాయలను ఏ విధంగా రుణమాఫీ చేశారో చెప్పాలని ఆయన అడిగారు. 

పెట్రో కెమికల్ కారిడార్‌ను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని విమర్శించారు.రాష్ట్రంలో విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఇప్పటివరకూ రుణమాఫీ కాలేదన్నారు. వారికి 10వేల రూపాయలు ఇచ్చామనడం పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. నగదు ఇచ్చామని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

loader