విజయవాడ: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర రావు సోమవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబుతో సమావేశం కానున్నారు. శనివారం నాడు బొండా ఉమ మహేశ్వర రావుతో  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమావేశమైన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరగిన ఎన్నికల్లో  విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బొండా ఉమా మహేశ్వరరావు 25 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. బొండా ఉమా మహేశ్వరరావు వైఎస్ఆర్‌సీపీలో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలో చంద్రబాబునాయుడు దూతగా బొండా ఉమా మహేశ్వరరావును ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శనివారం నాడు బేటీ అయ్యారు.

న్యూజిలాండ్ లో బంగీ జంప్ చేస్తూ రాజకీయంగా సాహసోపేత నిర్ణయం తీసుకోనున్నట్టుగా ట్విట్టర్ వేదికగా బొండా ఉమా మహేశ్వరరావు పోస్ట్ పెట్టారు.దీంతో చంద్రబాబుతో బొండా ఉమా మహేశ్వరరావు భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఎన్నికల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి బొండా ఉమా మహేశ్వరరావు విదేశాల్లో పర్యటించి శుక్రవారం నాడు విజయవాడకు చేరుకొన్నారు. వైఎస్ఆర్‌సీపీ చీఫ్ జగన్ నుండి పార్టీలో చేరాలని తనకు ఆహ్వానం అందిన విషయం వాస్తవమేనని బొండా ఉమా మహేశ్వరావు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు చెప్పినట్టుగా సమాచారం.

తాను టీడీపీలోనే కొనసాగుతానని బుద్దా వెంకన్నకు బొండా ఉమా మహేశ్వరరావు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.సోమవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడును కలిసేందుకు బొండా ఉమా మహేశ్వరరావు అంగీకరించినట్టుగా సమాచారం.

చంద్రబాబును కలిసిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా బొండా ఉమా మహేశ్వరరావు చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీలో చేరితే  విజయవాడ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ ను తనకు కేటాయించనున్నట్టుగా వైఎస్ఆర్‌సీపీ నుండి హామీ లభించిందని బొండా ఉమా మహేశ్వరరావు బుద్దా వెంకన్నకు చెప్పినట్టుగా తెలుస్తోంది.

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలోనే తన అనుచరులు ఉన్నారని బొండా ఉమా మహేశ్వరరావు వైఎస్ఆర్‌సీపీ వర్గాల దృష్టికి తీసుకెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత  బొండా ఉమా మహేశ్వరరావు ఏ ప్రకటన చేస్తారనేది ప్రస్తుతం  సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

బుజ్జగింపులు: చంద్రబాబు దూతగా బొండా ఉమతో బుద్ధా వెంకన్న భేటీ