విజయవాడ: ఇటీవల జరిగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుంది అనే స్థానాల్లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ రెబల్ అభ్యర్థులను నిలబెట్టారని మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ ఆరోపించారు. రెబల్ అభ్యర్థికి మద్దతుగా తన కుటుంబ సభ్యులతో ఉమా ప్రచారం చేయించారని పేర్కొన్నారు. ఏదైనా చేయండి కానీ టిడిపి గెలవకూడదు అని తన అనుచరులతో  బోండా చెప్పారని ఆరోపించారు. చివరకు బీసీ అభ్యర్థి అయిన తనను కూడా ఓడించడానికి బోండా ప్రయత్నించాడని అన్నారు. ఇందుకోసం తనకు ఫోటీగా రెబెల్ అభ్యర్థిని నిలబెట్టాడని.. ఎన్ని కుట్రలు చేసినా ఈ రెబల్ అభ్యర్థికి వచ్చింది కేవలం 600 ఓట్లు మాత్రమేనని రమణ తెలిపారు. 

''నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిగా నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. బీసీలకు ఇచ్చిన 33 శాతం రిజర్వేషన్లు వైసిపి ప్రభుత్వం తుంగలో తొక్కింది. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపింది టిడిపి'' అని అన్నారు. 

read more  ఏపీ పరిషత్ ఎన్నికలపై చేతులెత్తేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

''నాకు సీట్ ఇవ్వొద్దని చంద్రబాబు వద్దకు బోండా వెళ్లారు. అయినప్పటికి బీసీ అభ్యర్థిగా నాపై చంద్రబాబు నమ్మకం వుంచారు. అయితే టిడిపి నాయకుడే సొంత పార్టీ అభ్యర్థినయిన నన్ను ఒడిపోయేలా చేశాడు. ఇలా విజయవాడలో తప్ప ఎక్కడా జరిగి ఉండదు. గతంలో నాతో తిరిగిన రెబెల్ అభ్యర్థి నాడు కనిపించని అవినీతి ,నేడు కనిపిస్తుందా? టీఎన్టీయుసి అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, గరిమెళ్ళ చిన్న నాపై దుష్ప్రచారాలు చేశారు. నేను వాళ్ళలా పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాను, పార్టీ లైన్ కి, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తెదేపా లో ఉన్నా. మీరు చేసిన అవినీతి చిట్టా చంద్రబాబుకు అందజేస్తా'' అని రమణ హెచ్చరించారు. 

''విజయవాడ నగరపాలక సంస్థను టిడిపి కైవసం చేసుకునే సమయంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి నష్టం కలిగించారు. ఏమన్నా ఉంటే చంద్రబాబు వద్ద మాట్లాడాలి కానీ మీ ప్రెస్ మీట్ తో ప్రజల్లో రాంగ్ మెసేజ్ పంపారు. ప్రజల్లో తెదేపా బలంగా ఉంది ,మీ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీకి నష్టం కలిగించారు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా... పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం, దయచేసి పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజలు, పార్టీ కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు. దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.  బీసీలకు అండ... తెదేపా జెండా అని నమ్మేవాళ్ళలో నేను మొదటివాడిని. పార్టీ నాకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించింది'' అని గోగుల రమణ వెల్లడించారు.