విజయవాడ: టిడ్కో ఇళ్లపై తెలుగుదేశం పార్టీ పోరాటంతో వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర నుండి లేచిందని పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు టిడ్కో ఇళ్లు వెంటనే అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

''నవరత్నాల హామీల్లో భాగంగా అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. కానీ 18 నెలల జగన్ పాలనలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. చంద్రబాబు కట్టిన 8 లక్షల ఇళ్లను, వైసీపీ హామీ ఇచ్చినట్లుగా ఉచితంగా పేదలకు ఇవ్వాలి'' అని సూచించారు. 

''రాష్ట్రంలో 30 లక్షల పేదలకు సెంటు భూమి అని చెప్పి మోసం చేసింది వైసీపీ సర్కార్. ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఎక్కడా పేదల స్థలాలపై కోర్టుకి వెళ్ళలేదు'' అని ఉమ పేర్కొన్నారు.

''సెంటు స్థలం పేరుతో వైసీపీ 4 వేల కోట్లు అవినీతి చేసింది. వాటాలు తెలకపోవడంతోనే ఆలస్యమయ్యింది. పేదల కోసం, వైసీపీ కొన్న భూములులలో జరిగిన అవినీతి పై మా వద్ద ఆధారాలు వున్నాయి. దీనిపై సిట్, విజిలెన్స్  దర్యాప్తు వేసే ధైర్యం వైసీపీ కి వుందా?'' అని ఉమ సవాల్ విసిరారు.