గోదావరినదిలో పడవ మునిగిన ఘటనలో 22 మంది మరణించారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీశారు.
కాకినాడ: గోదావరినదిలో పడవ మునిగిన ఘటనలో 22 మంది మరణించారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. మరో 10 మృతదేహాల కోసం గాలిస్తున్నారు. 22 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
సంఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు బోరున ఏడుస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అక్కడే ఏర్పాట్లు చేశారు.
మంగళవారం సాయంత్రం లాంచీ గోదావరి నదిలో మునిగింది. తీవ్రమైన గాలుల వల్లనే ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. లాంచీ నదిలో 45 అడుగుల లోతులో పడింది. బుధవారం ఉదయం సహాయక బృందాలు లాంచీని గుర్తించాయి. అద్దాలు పగులగొట్టి లోనికి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాళ్లు కట్టి ఇతర బోట్లు, క్రేన్ల సాయంతో బోటును వెలికి తీశారు.
సంఘటనా స్థలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలేసి నష్టపరిహారం ప్రకటించారు మధ్యాహ్నమంతా ఆయన అక్కడే ఉన్నారు మంగళవారం రాత్రి చీకటి కావడంతో ఏమీ చేయలేకపోయారని చెప్పారు.
లాంచీ ప్రమాదానికి గల కారణాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబసభ్యులు, బాధితులను ఓదార్చారు.
