త్వరలో రూ. 5 వేల డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్న కేంద్రంఇప్పటికే నల్లధనం పెరిగిపోతోందని నిపుణుల ఆందోళనరూ. 5 వేల నోట్ల విడుదలతో నల్లధనం మరింత పెరిగిపోదా?

కేంద్రప్రభుత్వ చర్యలు చూస్తుంటే దేశంలో నల్లధనాన్ని నియంత్రించటం సాధ్యమా అని అనిపిస్తోంది. ఒకవైపు దేశంలో నల్లధనం పెరిగిపోతోందని చెబుతూనే హైయ్యర్ డినామినేషన్ అయిన రూ. 5000 నోట్లను విడుదల చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం మనకు రూ. 1000, రూ. 500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దాంతోనే పలు రంగాల్లోని ప్రముఖులు నల్లధన్నాని దాచుకోవటానికి అవస్తలు పడుతున్నారు. నల్లధనం అంటే లెక్కల్లో చూపని మొత్తాన్ని ఇంట్లోనో లేదా కార్యాలయాల్లోనో దాకుకుంటారని కాదు.

 కానీ, ఆదాయపుపన్ను శాఖ లేదా ఇతరత్రా శాఖలు జరుపుతున్న దాడుల్లో బయటపడుతున్న కోట్లాది రూపాయలు విలువైన కట్టల కొద్దీ కరెన్సీని మాటేమిటి. అంటే దాచుకోవటానికి అన్నీ మార్గాలు మూసుకుపోయిన తర్వాత మాత్రమే ఎక్కడో ఓ చోట కరెన్సీ కట్టలను బస్తాల్లోనో లేక అట్ట పెట్టెల్లోనో దాచుకుంటున్నారు. 1000, 500 రూపాయల నోట్లున్నపుడే వందలాది కోట్ల రూపాయలు దొరుకుతుంటే ఇక రూ. 5000 వేల డినామినేషన్ నోట్లు కూడా అందుబాటులోకి వస్తే ఇక ఐటి తదితర శాఖలు జరిపే దాడుల్లో వేల కోట్ల రూపాయలు దొరుకుతాయోమో.

 మొన్నటికి మొన్న మద్యం వ్యాపారస్తుడు, రాజకీయ నేత అయిన ఆదికేశవులనాయడుకు చెందిన కళాశాలపై జరిపిన దాడిలో దొరికిన రూ. 250 కోట్లను చూసి అధికారులే విస్తుపోయారు. ఒక గదిలో లెక్కలో చూపని డబ్బు ఇంత స్ధాయిలో దొరకటం ఇదే ప్రధమం. అదేవిధంగా 100 కోట్లకు అటుఇటుగా హార్డ్ క్యాష్ దొరకటం మామూలైపోయింది. ఆ మధ్య జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయవాడలోని ఒక కళాశాలపై అధికారులు జరిపిన దాడిలో సుమారు రూ. 300 కోట్లు దొరికింది.

గడచిన ఎన్నికల సమయంలో స్విస్ బ్యాంకులో దేశానికి చెందిన లక్షల కోట్ల నల్లధనం మూలుగుతోందని స్వయంగా భారతీయ జనతా పార్టీ నేతలే ప్రచారం చేసారు. ఆ మొత్తాన్ని ఏడాది కాలంలో దేశంలోకి తెప్పించి అందరికీ పంచేస్తామన్నట్లు ప్రచారం చేసారు. దాంతో అమాయకప్రజలు చాలా మంది అది నిజమేనని నమ్మి ఓట్లు కూడా వేసారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయిపోయినా నల్లధనాన్ని తెప్పించకపోగా మరింత పెరిగిపోయే చర్యలు చేస్తుండటం పట్ల పలువురు విస్తుపోతున్నారు.

తాజాగా కేంద్రప్రభుత్వం విడుదల చేయనున్న రూ. 5000 వేల నోట్ల డినామినేషన్ వల్ల నల్లధనం దాచుకోవటం మరింత సులభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోటి రూపాయలను తమతో తీసుకెళ్ళాలంటే ఇపుడు అంత సులభం కాదు. ఎందుకంటే, రూ. 1000 లేదా రూ. 500 నోట్లను తీసుకెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అయితే రూ. 5000 నోట్ల డినామినేషన్ వల్ల ఎవరైనా సరే కోటి రూపాయలను తమతో చాలా సులభంగా చిన్న సంచీలో కూడా తీసుకెళ్లిపోవచ్చు.