కాకినాడ నగరంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నగర పరిధిలోని గొడారి గుంటలోని సీతారంపురం సగర సామాజిక భవనంలో ఆదివారం అర్థరాత్రి క్షుద్ర పూజలను నిర్వహించారు. కాగా... వాటిని పోలీసులు అడ్డుకున్నారు. పూజలు జరుగుతన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి వచ్చి వాటిని అడ్డుకున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... సగరపేటకు చెందిన కొందరు చిన్నారులు, యువకులు ఇటీవల కాలంలో ఆకస్మికంగా మృత్యువాతపడ్డారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు కొందరు ఓ సిద్ధాంతిని ఆశ్రయించారు. కాగా... ఆయన సూచనల మేరకు ఆదివారం పూజలు నిర్వహించారు. కుండల్లో నెయ్యి పోసి దీపారాధన, పెద్ద ఎత్తున కుంకుమ, కొబ్బరి బొండాలు, మూడు నాటు కోళ్లు తదితర సామాగ్రితో పూజలు చేశారు.

అయితే.. వీటిని క్షుద్రపూజలుగా భావించిన కొందరు స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆ పూజలను అడ్డుకున్నారు. పూజలు నిర్వహిస్తున్న ఏడుగిరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.