కరోనా నుంచి కోలుకున్న వారిని ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ కబళిస్తుండటం దేశంలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ వల్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్‌ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఫంగస్ లక్షణాలు వున్న వారిని వైద్యులు గుర్తించారు. తాజాగా ఏపీలోని పలు జిల్లాల్లోనూ బ్లాక్ ఫంగస్ మరణాలు నమోదవుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ కేసులను ఇంకా ధృవీకరించలేదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.

నిడదవోలులో కోలపల్లి అంజిబాబు అనే వ్యక్లిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 15 రోజుల క్రితమే అంజిబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డిశ్చార్జ్ అయ్యే సమయానికే ఆయన కన్ను బాగా వాచిపోయింది. గతవారం రోజులుగా కన్ను వాపు పెరుగుతూ వస్తోంది.

Also Read:బ్లాక్‌ఫంగస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, నివారణ ఎలాగంటే?: రణదీప్ గులేరియా

దీంతో రాజమండ్రి, వైజాగ్ వైద్యులను ఆయన కుటుంబీకులు సంప్రదించారు. వీటిని బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు వీటిని ధృవీకరించారు. కన్ను, ముక్కు, మెదడుకు ఈ ఫంగస్ వ్యాపించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాల కారణంగా కన్నును వెంటనే తీయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు రాష్ట్రంలో ఎక్కడైనా నమోదయ్యాయా..? అని అధికారులు ఆరా తీస్తున్నారన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1600 వాయల్స్‌ను వాటాగా కేటాయించగా, వాటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.