బైరెడ్డి బిజెపి వైపు చూస్తున్నారు పురందేశ్వరి ఆయన్నకలిసింది పార్టీ లోకి ఆహ్వనించేందుకే టిడిపిలో చేరేందుకు సీనియర్లంతా అడ్డంకి

రాయలసీమ దుకాణం మూసేశాక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏమి చేయబోతున్నారు.

తిరిగేకాలు వాగే నోరు వూరుకోవు. బైరెడ్డి ఈ మధ్య కాలంలో రాష్ట్ర పరిక్షణ స‌మితి పేరు మీద బాగా తిరిగారు. అంతేకాదు,రాయలసీమకు అన్యాయం, రాయలసీమ రైతులకు అన్యాయం అని చాలా చాలా అరిచారు.అయితే, ఎవరూ పట్టించుకోలేదు. నంద్యాల ఎన్నిక ఆయనను బాగా దెబ్బతీసింది. ఎంతగా దెబ్బ తీసిందంటే, రాయలసీమ మిధ్య, రాయలసీమ వాదం మిధ్య అనే స్థాయికి వచ్చారు. పత్రికలోళ్లను పిల్చి,తాను స్థాపించిన రాయలసీమ పరిరక్షణ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆయన తొందర్లో తెలుగుదేశం వైపు వెళతారని, అపుడు ‘టిడిపిలో చేరడం సొంతఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది,’ అని కర్నూల్లో విలేకర్లను పిలిచి చెబుతారనుకున్నారు. అయితే, చిన్న మార్పు, టిడిపి కంటే, బిజెపి బాగుందని ఆయన అభిమానులు, అనుయాయులు సలహా ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్ల ఆయన బిజెపి వైపు చూస్తున్నట్లు నమ్మకస్తులు చెప్పారు. ఒక రౌండు జిల్లా నాయకులతో చర్చలు జరిపారని, రాష్ట్ర స్థాయిలో నాయకులతో కూడా టచ్ లో ఉన్నారని అంటున్నారు.

ఇంతతొందరగా బిజెపితో సంబంధం కుదిరేందుకుకారణం, భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో ప్రముఖనాయకులెవరైనా వస్తే చేర్చుకోవాలని తలపులు బార్లా తెరిచి ఎదురుచూస్తూఉండటమే. ముఖ్యంగా పెద్ద రెడ్లెవరైనా వస్తే బాగుంటుందనుకుంటున్నారు. ఇలాంటపుడు బైరెడ్డి వాళ్లకు ఆశాజ్యోతిలాగా కనిపించాడని, అందుకే చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

ఈ రోజు బిజెపి నేత పురందేశ్వరి ముచ్చుమర్రిలో బైరెడ్డిని కలవడం ఆయన కు ఆహ్వానం అందించేందుకే నని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. ముచ్చుమర్రి ఆయన స్వగ్రామం.ముచ్చుమర్రి పుష్కర్‌ఘాట్‌ వద్ద రాయలసీమ జిల్లాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. అక్కడే రాయలసీమ వాదాన్ని భూస్థాపితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. పురందేశ్వరి ఆహ్వానాన్ని బైరెడ్డి స్వీకరించినట్లు తెలిసింది. పార్టీలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారని అంటున్నారు.

బైరెడ్డి రూటు ఎందుకు మార్చారంటే... టిడిపి వర్గాల కథనం ప్రకారం నోరున్న బైరెడ్డి రాక‌ను భూమా అఖిల ప్రియ‌, కెఇ కృష్ణ‌మూర్తి, ఏరాసు ప్ర‌తాప్‌రెడ్డి, మండ్ర శివానంద‌రెడ్డిలు వ్యతిరేకిస్తున్నారు. నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో క‌ర్నూలు జిల్లాకు చెందిన నేత‌లు ముక్త‌కంఠంతో బైరెడ్డిని చేర్చుకోవ‌ద్ద సూచించారట.

దీనిని అదనుగా చేసుకుని బిజెపి వల విసిరింది. ఇప్పటికే జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి బిజెపిలో ఉన్నారు. ఇపుడు బైరెడ్డి చేరితో, పార్టీకి కండబలం, మాటబలం రెండు వస్తాయి. అందువల్ల ఏమయినా సరే బైరెడ్డిని వదలకూడదని నిర్ణయించిందని, ఆయనను తొందర్లో పార్టీ అధ్యక్షునికి పరిచయం చేస్తారని కూడా చెబుతున్నారు.