ఈ మొత్తంలొ కేంద్రం పరువు పోవటమే కాకుండా గవర్నర్ వ్యవస్ధను కమలం పార్టీ భ్రష్టుపట్టిస్తోందన్నది స్పష్టమైంది.

కమలం పార్టీ మరోసారి పరువు పోగొట్టుకుంటోంది. తమిళనాడు రాజకీయాల్లో భాజపా చేస్తున్న నిర్వాకంతో గవర్నర్ వ్యవస్ధ పరువే బజార్న పడింది. మెజారిటీ ఎంఎల్ఏల మద్దతున్న శశికళను కాదని పట్టుమని 10 మంది మద్దతు కూడా లేని పన్నీర్ సెల్వంను అండగా నిలవాలని గవర్నర్ అనుకున్నారు. గవర్నర్ వైఖరి చూస్తుంటేనే ఆ విషయం అందరికీ అర్ధమైపోతోంది. దాదాపు వారం క్రితమే 130 మంది ఎంఎల్ఏలు శశికళను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి చిన్నమ్మచేత సిఎం ప్రమాణస్వీకారం చేయించటం మినహా గవర్నర్ కు వేరే దారి లేదు.

ఇక్కడే కేంద్రం తెరవెనుక రాజకీయం మొదలుపెట్టంది. శశికళ మీదున్న వ్యక్తిగత ధ్వేషంతో ఆమెను ముఖ్యమంత్రి కానీయకూడదని ప్రధానమంత్రి అనుకున్నట్లే కనబడుతోంది. అందుకని పన్నీర్ సెల్వంకు మద్దతిచ్చి రెచ్చగొట్టారు. దాంతో పన్నీర్ కూడా ‘అత్మసాక్షి’, ‘అమ్మ సాక్షి’ అంటూ మెరీనాబీచ్ లో రాజకీయం మొదలుపెట్టారు. దాంతో రాజకీయాలు రోడ్డునపడ్డాయి. గడచిన పది రోజులుగా శశికళకే మెజారిటీ ఎంఎల్ఏల మద్దతుందన్నది వాస్తవం. అయినా సరే చిన్నమ్మను ఎదుర్కొనేందుకు పన్నీర్ సిద్ధమైన దగ్గర నుండి ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వివాదం నడుస్తోంది.

అయితే, సిఎం కోసం పోటీ మొదలై ఇప్పటికి ఏడు రోజులైనా ఇప్పటి వరకూ పన్నీర్ కు మద్దతుగా పదిమంది ఎంఎల్ఏలు కూడా నిలవలేదు. మరోవైపు చిన్నమ్మకు119 మంది ఎంఎల్ఏలు అండగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. క్యాంపులో ఉన్న ఎంఎల్ఏలతో పోలీసులు, రెవిన్యూ అధికారులు స్వయంగా మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికే అది. ఇన్ని రోజులూ గవర్నర్ రూపంలో కేంద్రం మద్దతుగా నిలబడినా పన్నీర్ బలం పెరగటం లేదు. ఈ దశలో గవర్నర్ కు ఏమి చేయాలో అర్ధం కావటం లేదు.

అందుకే భాజపా కొత్త పాట మొదలుపెట్టంది. శశికళ సిఎం అవ్వాలంటే మెజారిటీ మాత్రముంటే సరిపోదట. ఇంకా అనేక అంశాలను కేంద్ర పరిశీలిస్తోందని వెంకయ్యనాయడు శెలవివ్వటం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సిఎం అవ్వాలంటే ఎంఎల్ఏ మద్దతే ప్రాతిపదిక. మోడి ప్రధానమంత్రి అయింది కూడా ఎంపిల మద్దతు ద్వారానే అన్న విషయం కమలనాధులు మరచిపోయినట్లున్నారు. భాజపా ఆడుతున్న తెరవెనుక రాజకీయంతో కమలనాధులకు ఏ విధంగాను లాభించదు. ఎందుకంటే, పన్నీర్ కు ఎన్ని జాకీలేసినా ఉపయోగం కనబడటం లేదు. ఈ మొత్తంలొ కేంద్రం పరువు పోవటమే కాకుండా గవర్నర్ వ్యవస్ధను కమలం పార్టీ భ్రష్టుపట్టిస్తోందన్నది స్పష్టమైంది.