కర్నూలు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకు తహతహలాడుతోందని ఆరోపించారు. దీనిని టీడీపీ నేతలు అంగీకరించాలని సవాల్ విసిరారు. 

తాము బీజేపీతో పొత్తుకు ప్రయత్నించడం లేదని టీడీపీ నేతలు ఎవరైనా చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసేందుకే టీడీపీ నేతలు బీజేపీ కేంద్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు వివరించారు.

కేంద్ర కార్యాలయం చుట్టూ తిరిగిన టీడీపీ నేతలు, బీజేపీ ప్రముఖులతో భేటీ అయిన నేతల వీడియో బండారం తన దగ్గర ఉందన్నారు. వాటిని బయటపెడ్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి రోజులు అంటూ హెచ్చరించారు. 

ఈ నెల 18న అమిత్‌షా రాయలసీమలో అడుగు పెడుతున్నారని, టీడీపీ వాళ్లకు దమ్ముంటే అమిత్‌షాను అడ్డుకోండి అంటూ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నేతలు సీబీఐ, ఈడీలకు టీడీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి జరగకపోతే టీడీపీ సీబీఐ, ఐటీని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు.

6వ విడత జన్మభూమి పేరుతో టీడీపీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వేల సంఖ్యలో ప్రజల అర్జీలు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు. 

దేశంలో ఎక్కడాలేనన్ని కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ లోనే జరిగాయని ఆయన ఆరోపించారు. దేశంలో ఏ ప్రభుత్వం చెయ్యనంత అవినీతి ఏపీ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అగ్రిగోల్డ్  కుంభకోణం ఏపీలో జరిగిందన్నారు. అగ్రిగోల్డ్  ఆస్తులను కొల్లగొట్టేందుకు టీడీపీ మంత్రివర్గం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 

రెండు రోజుల క్రితం పవన్ తో కలిసి పోటీ చేస్తే జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. చివరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి వివరణ ఇస్తే కానీ ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడలేదు. 

తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ కాదని చెప్తే తాను వీడియోలు విడుదల చేస్తానని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుటు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారబోతున్నాయి.