అమరావతి: టీడీపీలో తిరుగుబాటు వస్తోంది... ఆ పార్టీ చీలిపోనుందని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  విష్ణువర్ధన్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు చేస్తున్నారని ఆయన చెప్పారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలను త్వరలోనే చూడనున్నారని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఆయన జోస్యం చెప్పారు. 

బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ఎవరిని పార్టీలో చేర్చుకోవాలనే  విషయమై నాయకత్వం నిర్ణయం తీసుకొంటుందని  ఆయన చెప్పారు. 

ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెబితే ప్రజలను మోసం చేయడమేనన్నారు. ప్రత్యేక హోదా పేరుతో అన్ని పార్టీలు తమ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.