అమిత్ షాపై దాడి: బిజెపి వ్యూహం, చంద్రబాబు కార్నర్?

BJP trying to corner Chandrababu
Highlights

తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై దాడిని రాష్ట్ర బిజెపి నాయకులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతి: తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై దాడిని రాష్ట్ర బిజెపి నాయకులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయడానికి ఆ సంఘటనను వాడుకున్నట్లు చెబుతున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన అమిత్ షా కాన్వాయ్ ని అడ్డుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడి జరగలేదని హోం మంత్రి చిన్న రాజప్ప చేసిన ప్రకటన గాలికి కొట్టుకుని పోయింది. దాడి చేయకపోతే కారు అద్దాలు ఎలా పగులుతాయని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

అమిత్ షా మాత్రం ఆ సంఘటనపై ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బిజెపిపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పడానికి తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాలు ఎవీ ఫలించడం లేదు. 

చిన్నరాజప్ప చేసిన ప్రకటనకు చంద్రబాబు చేసిన ప్రకటనకు మధ్య వైరుధ్యం కూడా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసింది. దాడిని చంద్రబాబు ఖండించడమే కాకుండా దాడి చేసినవారిలో టీడీపి వాళ్లు ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని గ్రహించిన బిజెపి నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.

మరో అంశాన్ని కూడా వారు ముందుకు తెచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాత్రమే కాకుండా టీడీపి గుండాయిజాన్ని కూడా ప్రోత్సహిస్తుందనేంత వరకు వారు వెళ్లారు. ఈ రకంగా చంద్రబాబును బిజెపి నాయకులు కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చినవారిని అతిథులుగా చూడాలని, అలా కాకుండా అమిత్ షాపై దాడి చేయడం వల్ల రాష్ట్రం పేరు కూడా చెడిపోయిందని అంటున్నారు. మొత్తం మీద, బిజెపి నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అంది వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.

అమిత్ షాపై జరిగిన దాడిపై బిజెపి నాయకులు శనివారం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటున్నామని, తమ వారి తప్పు ఏమైనా ఉన్నా కూడా చర్యలు తీసుకుంటామని డిజిపి మాలకొండయ్య చెప్పారు. జడ్ ప్లస్ కెటగిరీ భద్రత ఉన్న అమిత్ షాపై దాడి జరిగిందని, దాన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని బిజెపి నాయకులు చెప్పదలుచుకున్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా పోలీసుల వైఫల్యాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. చంద్రబాబు కావాలని దాడి చేయించారనే ఆరోపణ కూడా చేస్తున్నారు. ఇది చంద్రబాబును ఇరకాటంలో పెట్టేదేనని భావించవచ్చు.

loader