‘విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ ఇవ్వనని కేంద్రప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు’..ఇది తాజాగా బడ్జెట్ పై భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబు చేసిన వ్యాఖ్యలు. కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులు కానీ విభజన హామీల ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించమని చంద్రబాబునాయుడు ఇటీవలే ప్రదానమంత్రి నరేంద్రమోడిని స్వయంగా కలిసినా ఉపయోగం కనబడలేదు.

తాజాగా మీడియాతో హరిబాబు మాట్లాడుతూ, రైల్వేజోన్ అంశంపై కేంద్రప్రభుత్వం రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పటం విచిత్రంగా ఉంది. విశాఖ రైల్వేజోన్ ఆర్ధికంగా పెద్దగా ఉపయోగం లేదని రైల్వే అధికారులు చెప్పటాన్ని ఎంపి విభేదించారు. అదికారుల నివేదకను పక్కనపెట్టేసి రాజకీయ నిర్ణయం తీసుకుంటేనే రైల్వేజోన్ సాధ్యమవుతుందన్నారు. పైగా విభజన హామీల అములకు కేంద్రం కట్టుబడి ఉందని హరిబాబు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

హరిబాబు తీరు చూస్తుంటే భాజపా ఇంకా ఏపి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నట్లే కనబడుతోంది.  బడ్జెట్ విషయంలో ఇంకా జనాలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఏపికి మొండిచెయ్యి చూపించిన భాజపా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎలా  అనుకుంటోందో అర్దం కావటం లేదు.