ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడలేదన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇవాళ దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడలేదన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. శనివారం తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌ను.. బాధ్యతాయుత పాలిటిక్స్ వైపు మోడీ మళ్లించారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు మోడీ మొగ్గు చూపారని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ఏం చేసిందో రాష్ట్ర నేతలు వివరించారని ఆయన పేర్కొన్నారు. 

పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు వుండేవని జేపీ నడ్డా గుర్తుచేశారు. 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం వుండేదని తెలిపారు. ఇవాళ దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదని ఆయన పేర్కొన్నారు. దేశంలో 50 కోట్ల మందికి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని మోడీ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇప్పటికే ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసిందని నడ్డా తెలిపారు. ఉజ్వల పథకం కింద 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. 

అంతకుముందు పురంధేశ్వరి ప్రసంగిస్తూ.. ఏపీలో గడిచిన నాలుగేళ్లుగా ఎలాంటి పరిస్థితులు వున్నాయో తమకు తెలుసన్నారు. ప్రజాహితాన్ని కాంక్షించి మాత్రమే పాలకుడు పనిచేయాలన్నారు. బీజేపీ అధికారాన్ని సేవా మార్గంగా ఉపయోగించుకునే పార్టీ అని, గతంలో రోజుకో స్కాం గురించి చదివేవాళ్లమని, ఇప్పుడు స్కీమ్‌ల గురించి పత్రికల్లో చదువుతున్నామని పురంధేశ్వరి పేర్కొన్నారు.