ఆయుష్మాన్ భారత్‌ను జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీగా మార్చింది.. ఏపీకి బీజేపీ అవసరం ఉంది: జేపీ నడ్డా
రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఏపీకి చేరుకున్న జేపీ నడ్డా.. విజయవాడలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. విజయవాడలో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అర్జునుడు తపస్సు చేసిన పుణ్యభూమి విజయవాడ అని పేర్కొన్నారు
దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్ర ప్రబుత్వం కృషి చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఏపీకి చేరుకున్న జేపీ నడ్డా.. విజయవాడలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. విజయవాడలో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అర్జునుడు తపస్సు చేసిన పుణ్యభూమి విజయవాడ అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దిపై సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని అన్నారు. కులాలు, మతాలు అతీతంగా అందరం కలిసి పనిచేయాలన్నారు. కొత్త వారిని పార్టీలోకి తీసుకోవడంపై దృష్టి సారించాలన్నారు.
మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలని సూచించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో 10,680 శక్తి కేంద్రాలున్నాయన్నారు. అందులో రెండున్నర వేల కేంద్రాలకు ఇంకా కమిటీలు వేసుకోవాలని చెప్పారు. రాబోయే రెండు నెలల్లో మిగిలిన శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌లను నియమించుకుందామని అన్నారు. బీజేపీ అవశ్యకతను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు తెలిపారు.
ఆయుష్మాన్ భారత్‌ను సీఎం జగన్ ఆరోగ్య శ్రీగా మార్చేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ జగన్ పథకం కాదని.. కేంద్ర ప్రభుత్వ పథకమని చెప్పుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనసాగిస్తే.. దేశంలో ఎక్కడైనా చికిత్స పొందవచ్చని తెలిపారు. ఆరోగ్యశ్రీ రాష్ట్రం దాటితే పనికిరాదని అన్నారు. పథకం పేరు మార్చడం ద్వారానే ఇలా జరిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో రూ. 5 లక్షల వరకు వైద్యసాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
‘‘దేశంలో 10.40 లక్షల బూత్‌లు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 46 వేల బూత్‌లు ఉన్నాయి. ఆ 46 వేల బూత్‌లన్నింటికీ మనం చేరుకోవాలి. ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే మోదీ మన్ కీ బాత్‌ను ప్రతి బూత్‌లో కార్యకర్తలతో కలిసి కూర్చొని వినండి. ప్రతి కార్యకర్త ఇంటి పై బిజెపి జెండాను ఏర్పాటు చేయాలి. కమలం గుర్తు లేకుండా మన ఉనికి లేదు’’ అని నడ్డా అన్నారు. స్థానిక సమస్యలపై ప్రతి బూత్ కమిటీలో చర్చించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని నేతలకు తెలిపారు.
బీజేపీ అంటే ఒక వర్గానికి చెందినది కాదని.. అన్ని వర్గాలదని అన్నారు. బీజేపీ అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని ప్రజల్లో తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధికి సంబంధించి సమావేశం నిర్వహించుకోవాలని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఏమేమి ఇచ్చిందో.. ఈ రోజు ఆవిష్కరించిన పుస్తకంలో ఉందన్నారు. అందులోకి అంశాలను ప్రచారం చేయాలని చెప్పారు. సౌభాగ్య కార్యక్రమం రెండున్నర కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నామని చెప్పారు.