జగన్ పై ఆరోపణలు చేసే తొందరలో ప్రధానిమంత్రిపై కూడా వ్యాఖ్యలు చేయటంతో లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని తెలుసుకున్నారు చంద్రబాబు. అందుకనే ఇకనుండి కేవలం జగన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని ఎట్టి పరిస్ధితుల్లోనూ భాజపా జాతీయ, రాష్ట్ర నేతల ప్రస్తావన తేవద్దని స్పష్టంగా ఆదేశించారు.

తెలుగుదేశంపార్టీ నాయకత్వంపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నదా? గత ఐదురోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత భాజపా జాతీయ నాయకత్వం టిడిపి నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోడి, వైసీపీ అధ్యక్షుడు జగన్ భేటీపై టిడిపి నేతలు తమ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసారు. తమకు తెలియకుండా మోడి వైసీపీ అధినేతను కలవకూడదన్నట్లుగా పలువురు మంత్రులు ఆక్షేపణ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వటంపై కూడా మోడిని పలువురు మంత్రులు తప్పుపట్టారు.

మంత్రులు ఎప్పుడైతే మోడిపై విరుచుకుపడుతున్నారో వెంటనే భాజపా స్ధానిక నాయకత్వం మంత్రుల వ్యాఖ్యలను, ఆక్షేపణలను ఢిల్లీలోని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుండి వచ్చిన సంకేతాలతోనే స్ధానిక నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, విష్ణుకుమార్ రాజు మంత్రులు, నేతలపై పెద్ద ఎత్తున ఎదురుడాది మొదలుపెట్టారు. దాంతో మంత్రులు, నేతలు బిత్తరపోయారు. తాము వైసీపీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తే, మిత్రపక్షమైన భాజపా నేతలు తమపై ఎదురుదాడి చేయటాన్ని జీర్ణించుకోలేకపోయారు.

వెంటనే అమెరికాలో ఉన్న చంద్రబాబుకు ఇక్కడ జరిగిన విషయాలను చేరవేసారు. మోడి ప్రస్తావన లేకుండా జగన్ పై మాత్రమే విమర్శలు, ఆరోపణలు చేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు. అయితే, అప్పటికే సమయం మించిపోయింది. తర్వాత విజయవాడకు తిరిగి వచ్చిన తర్వాత మోడి-జగన్ భేటీపై చంద్రబాబు ఆరా తీసారు. దాంతోపాటే జరిగిన డ్యామేజీని కూడా అంచనా వేసారు. అందుకనే సోమవారం మంత్రులు, నేతలతో ప్రత్యేక సమావేశం పెట్టి ఇక నుండి మోడి ప్రస్తావన ఎట్టి పరిస్ధితిలో తేవద్దని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.

జగన్ పై ఆరోపణలు చేసే తొందరలో ప్రధానిమంత్రిపై కూడా వ్యాఖ్యలు చేయటంతో లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని తెలుసుకున్నారు చంద్రబాబు. అందుకనే ఇకనుండి కేవలం జగన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని ఎట్టి పరిస్ధితుల్లోనూ భాజపా జాతీయ, రాష్ట్ర నేతల ప్రస్తావన తేవద్దని స్పష్టంగా ఆదేశించారు.