ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధీశ్వరి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. పారి శ్రామిక రాయితీలు హోదాలో భాగం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. 

మరోవైపు గోదావరి జలాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏపీ హక్కులకు భంగం కలిగించకుండా సీఎం జగన్ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 

మరోవైపు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే అలాంటి కాంగ్రెస్ తోనే చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారంటూ విమర్శించారు. 

ఏపీలో వలసలు కొనసాగుతాయని పురంధీశ్వరి స్పష్టం చేశారు. బీజేపీలో చేరేందుకు అన్ని పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రతీ పౌరుడు అర్థం చేసుకుంటున్నారని అందుకే బీజేపీకి ఇంత ఆదరణ లభిస్తోందని పురంధీశ్వరి చెప్పుకొచ్చారు.