అనంతపురం: బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి తొలిసారిగా తన మరిది మాజీ సీఎం చంద్రబాబు నాయుడును వెనకేసుకు వచ్చారు. నిత్యం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసే పురంధేశ్వరి మరిది చంద్రబాబుపై సానుకూలంగా మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పర్యటనలో నెలకొన్న పరిణామాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కుంది కానీ అదే నిరసన పేరుతో రాళ్లు, చెప్పులు వేయడం సరికాదన్నారు. 

అమరావతి పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేయడం సరికాదని దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను ఎవరూ స్వాగతించరని హెచ్చరించారు పురంధేశ్వరి.  

Chandrababu Amaravati tour: శంకుస్థాపన చోటును ముద్దాడి చంద్రబాబు భావోద్వేగం

రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబును సమర్థవంతమైన నాయకుడని నమ్మిన ప్రజలు 2014లో అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు సరైన రాజధాని నిర్మాణం చేపట్టలేకపోయారని, ఈ నేపథ్యంలోనే రాజధాని రైతుల్లో బాధ ఉందన్నారు. 

అయితే ఆ బాధను రైతులు ఇలా వ్యక్తం చేయడం మంచిది కాదని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపైనా విరుచుకుపడ్డారు పురంధేశ్వరి. రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చడం ఏ మేరకు సమంజసమో రాష్ట్ర మంత్రులు ఆలోచించుకోవాలని హితవు పలికారు. 

అమరావతి పర్యటన... చంద్రబాబు బస్సుపై చెప్పుతో దాడి

జగన్‌ ప్రభుత్వం రాజధానిని ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మార్పుకోసం ప్రజలు వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారని, అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు రావడం లేదని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. జాతీయ మీడియాలోనూ ఇదే అంశంపై కథనాలొస్తున్నట్లు పురంధేశ్వరి తెలిపారు. 

ఏం జరిగిందో చెప్పడానికి వస్తే దాడికి దిగుతారా: వైసీపీపై బాబు ఫైర్