అమరావతి: వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని భవిష్యత్తు మాత్రమే నిర్ణయిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరీ చెప్పారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టీమ్ లో పురంధేశ్వరీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఈ సందర్భంగా ఆమె ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని ఆమె ప్రకటించారు. దక్షిణాదిలో బీజేపీకి ఉనికి ఉందన్నారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేస్తామని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. 

ఏపీ రాష్ట్రంలోని పరిణామాలతో పాటు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె స్పష్టం చేశారు. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానమే నిర్ణయిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆమె రైతులను కోరారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరీకి చోటు లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆమెకు కట్టబెట్టారు. జేపీ నడ్డా టీమ్ లో ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఈ నెల 26వ తేదీన జేపీ నడ్డా బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతలకు ప్రాధాన్యత దక్కింది.