కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ధన్యవాదాలు తెలిపారు.

గురువారం కర్నూలు జిల్లా పర్యటన నిమిత్తం ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎంకు టీజీ స్వాగతం పలికి, అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

Also Read:మూడు రాజధానులు: యడియూరప్పకు గ్రీన్ సిగ్నల్, జగన్ కు ఊరట

కర్నూలుకు హైకోర్టును తరలించే అంశంపై కేంద్రం అనుమతి కోరామని, ఇందుకు సంబంధించి నివేదిక కూడా పంపించామని జగన్ వివరించారు. రాయలసీమ డిక్లరేషన్‌లో భాగంగా బీజేపీ మేనిఫెస్టోలో హైకోర్టు అంశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని టీజీ వెంకేటేశ్ ముఖ్యమంత్రితో అన్నారు.

పత్తికొండ ఎమ్మెల్యే కె. శ్రీదేవి కుమారుడి వివాహ వేడుక గురువారం జరిగింది. దీనిలో పాల్గొనేందుకు గాను సీఎం దిన్నెదేవరపాడుకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.

Also Read:జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఆ రెండు రాజధాని గ్రామాలు ఇక...

పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రూపొందించిన వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించగా.. మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే.