బెంగళూరు: పాలనా వికేంద్రీకరణ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దారిలో నడవనున్నారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, కర్నూలు న్యాయ రాజధానిని, అమరావతిలో సచివాలయ రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది.

జగన్ వ్యతిరేకతను ఎదుర్కుంటున్నప్పటికీ కర్ణాటక బిజెపి ప్రభుత్వం ఆయన బాటలో నడవాలని నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించబోతోంది. పాలనా వికేంద్రీకరణ పేరతో ముఖ్యమైన కొన్ని కార్యాలయాలను బెంగళూరును తరలించాలని యడియూరప్ప నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటక ప్రభుత్వానికి బిజెపి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. యడియూరప్పకు బిజెపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పబోదని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు వర్గాలు భావిస్తున్నాయి. 

ఉత్తర కర్ణాటక ప్రజలను దృష్టిలో ఉంచుకుని, వారికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కార్యాలయాలను బెంగళూరు నుంచి తరలించాలని నిర్ణయించినట్లు కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఇటీవల మీడియాతో అన్నారు. 

కర్ణాటక ప్రభుత్వం 9 ముఖ్యమైన కార్యాలయాలను బెంగళూరు నుంచి తరలించబోతోంది. వీటిలో కృష్ణా భాగ్య జల నిగమ్, కర్ణాటక నీరవారి నిగమ్, పవర్లూమ్ కార్పోరేషన్, షుగర్ డైరెక్టరేట్ అండ్ షుగర్ కేన్ డెవలప్ మెంట్ కనిషనర్, కర్ణాటక మానవ హక్కుల కమిషన్, ఉపలోకాయుక్త కార్యాలయాలు ఉన్నాయి.