న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్  ఏనిర్ణయం తీసుకున్నా ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాల ఆశీస్సులతోనే చేస్తున్నారని చెప్పడాన్ని ఖండించారు. 

పీపీఏలు, పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం యెుక్క ప్రమేయం లేదని సుజనాచౌదరి స్పష్టం చేశారు. వైయస్ జగన్ కు మోదీ, అమిత్ షా ల ఆశీస్సులు ఉన్నాయని వారికి చెప్పిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్న వ్యాఖ్యలపై తాను ఆరా తీసినట్లు సుజనాచౌదరి తెలిపారు. 

అయితే రీటెండరింగ్ అంశంలో తన ప్రమేయం లేదని జలశక్తి మంత్రి, పీపీఏల అంశంలో కూడా తమ పాత్ర లేదని విద్యుత్ శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలతో చర్చించి వారి ఆశీస్సులపై అడిగి తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు. 

మోదీ, షాల ఆశీస్సులు ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. రీటెండరింగ్ పై కేంద్రం యెుక్క ఆశీస్సులు ఏమీ లేవన్నారు. ఒకవేళ ఉంటే పోలవరం అథారిటీ ఎందుకు లేఖ రాస్తుందని నిలదీశారు. 

ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు మాని పనులు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు కాస్త ఇబ్బందులు తలెత్తాయని జగన్ ప్రభుత్వం అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కోరారు. 

అఖండ మెజారిటీ సాధించిన వైయస్ జగన్ సర్కార్ ప్రజలు ఆశించిన ప్రభుత్వాన్ని అందిస్తారని, ప్రజారంజకపాలన అందిస్తారని తాను ఆశీస్తున్నట్లు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలకు కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని మరోసారి తెగేసి చెప్పారు సుజనాచౌదరి. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్