ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్‌ విపత్తు కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. 

గతంలో విపత్తు నిధి కింద రూ.2200 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదలం చేసిందని చెప్పుకొచ్చారు. దాన్ని ఎలా ఖర్చు పెట్టారో టీడీపీ ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడి  పాలనను గాలికొదిలేసి రాజకీయాలపై దృష్టిపెట్టారని ఆరోపించారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మాతో కలిసి లేకపోయినా తిత్లీ తుఫాన్ సంభవించినప్పుడు రూ.559 కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు.

టీడీపీ నాయకులు అడ్డుగోలుగా లెక్కలు రాస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. తుపాను సాయం కింద ఎవరికి డబ్బులు ఇచ్చారో వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.  

నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన సొమ్మును ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పి తన నిజాయతీ నిరూపించుకోవాలని చంద్రబాబుకి హితవు పలికారు.

తెలంగాణలో టీడీపీని వదిలేశాక బీజేపీకి ఓటు శాతం పెరిగిందన్నారు. బీజేపీకి ఒక్క సీటు రావడం గొప్ప విషయమని అయితే చాలా చేశానన్న చంద్రబాబుకు దక్కింది రెండు సీట్లేగా అని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు.