విశాఖలో భూ కబ్జాదారులను సీఎం జగన్ ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖ భూ కుంభకోణాలపై తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
విశాఖలో భూ కబ్జాదారులను సీఎం జగన్ ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూ కుంభకోణానికి సంబంధించి సిట్ నివేదికను బయటపెట్టాని జీవీఎల్ డిమాండ్ చేశారు. తమకు బీజేపీ అండ అవసరం లేదంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.
వైసీపీకి బీజేపీ అనుకూలంగా వుందనే భ్రమలు కలిగించే డ్రామా రాజకీయాలు మానుకోవాలని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలని చురకలంటించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం కేంద్రం రాడార్‌లో వుందని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు సాధించడం కోసం వేట జరుగుతోందని.. విశాఖ భూ కుంభకోణాలపై తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
ALso Read: ఏపీకి రూ.5 లక్షల కోట్లు ఇచ్చాం .. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి : జగన్ పాలనపై అమిత్ షా విమర్శలు
ఇదిలావుండగా.. ఆదివారం విశాఖలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మోడీ వచ్చాక మనదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నినాదమే వినిపిస్తోందని ఆయన తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందని.. కానీ జగన్ తమది రైతు ప్రభుత్వమంటున్నారని అమిత్ షా దుయ్యబట్టారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారని.. మోడీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫోటోలు వేసుకున్నారని ఆయన మండిపడ్డారు.
జగన్ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని అమిత్ షా ఆరోపించారు. పదేళ్లలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులకు తగినట్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తుందా అని అమిత్ షా ప్రశ్నించారు. రూ.5 లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రంలో ఏది అని కేంద్ర హోంమంత్రి నిలదీశారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తుందని ఆయన ఆరోపించారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టామని.. భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు ఇచ్చామని అమిత్ షా గుర్తుచేశారు. విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
