అమరావతి: నీతి ఆయోగ్ సమావేశంపై టిడిపి మీడియాలో అసత్యాలను ప్రసారం చేసిందని  బిజెపి ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.  ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటే ఇదేనా అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నవ్వుతూ మాట్లాడిన చిత్రాలను  ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఆదివారం నాడు ప్రధామంత్రి మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం  జరిగింది.ఈ సమావేశంలో  ఏపీ రాష్ట్ర ప్రయోజనాల గురించి  చంద్రబాబునాయుడు సుమారు 20 నిమిషాలు ప్రసంగించారు. అయితే నీతి ఆయోగ్ సమావేశం గురించి టిడిపి నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం జరిగేలా ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు.

కేంద్రంతో చంద్రబాబునాయుడు యుద్ద వైఖరిని అవలంభించారంటూ అసత్య ప్రచారం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంతో చంద్రబాబునాయుడు ఘర్షణ వైఖరిని అవలంభించలేదన్నారు. ఈ మేరకు మోడీతో బాబు నవ్వుతూ మాట్లాడే చిత్రాలను ట్వీట్ చేశారు జీవీఎల్ నరసింహరావు.


ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబే చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా కావాలని బాబు యూ టర్న్ తీసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని జీవీఎల్ నరసింహారావు చెప్పారు.

 ప్రచారాలకు పరిమితమై ప్రజల అభివృద్ధికి పనిచేయడం లేదన్నారు. ప్రజా సంక్షేమానికి చొరవ తీసుకోవడం లేదు. కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏమీ పట్టనట్టు ఉన్నారని బాబుపై ఆయన మండిపడ్డారు.